మన పిల్లలు పెరుగుతుంటే చూడడం ఒక గొప్ప అనుభూతి. వారి ప్రతి అడుగు మన గుండెల్లో ముద్ర వేస్తుంది. వారి ప్రతి మాట మన మనస్సులో నాటుకుపోతుంది. చూస్తూ చూస్తూ ఉండగానే మనకు ఎన్నో జ్ఞాపకాలు ఇస్తూ పెద్దవారు అయిపోతారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తరువాత ఒక సంవసత్సరం రోజులు తెలియకుండానే గడిచిపోతాయి. అప్పటి వరకు మన చేతుల్లో పెరిగిన బాబు తన కాళ్ళతో నడవడం మొదలు పెట్టేస్తాడు. ఈ సమయంలో వారి ఎదుగుదల కూడా అధికముగా ఉంటుంది. కాబట్టి, వారికి పౌష్టికమైన ఆహారం అత్యంత అవసరం.
ఇప్పుడు 12 నెలల వరకు పిల్లల పెరుగుదల ఏలా ఉంటుందో తెలుసుకుందాము
1. 0 – 4 నెలల వరకు
ఈ మొదటి నెలల్లో పిల్లల ఎదుగుదల ముఖ్యంగా తల్లి పాలు మరియు నిద్రపోవడం వలన జరుగుతుంది. పిల్లల్లో మెల్ల మెల్లగా కదలికలు మొదలవుతాయి. అవి చిన్నవే అయ్యుండచ్చు కాని మనకు ఎంతో సంతోషము కల్గిస్తాయి. పిల్లలు మన వైపు చూసినప్పుడు, చిన్నగా నవ్వినప్పుడు, మన వేలు గట్టిగా పట్టుకున్నపుడు మనం పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇంకా, పెద్ద చప్పుడు వినపడితే గట్టిగా ఏడవడం, బుజ్జి బుజ్జిగా నోరు తెరవడం ఇలా వారి ప్రతి ఒక్క పని మనల్ని ఆశ్చర్యానికి మరియు ఆనందానికి గురి చేస్తాయి. ఈ వయస్సులో పిల్లలు పొట్ట మీద పడుకొని తల కొంచెం వరకు ఎత్తగలరు. ఈ చేష్టలు చేస్తున్నారంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం.
2. 4 – 8 నెలలు
తరువాతి దశలో పిల్లలతో గడపడం అత్యంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లల ముఖకవళికలు చూసి వారికి ఏమి కావాలో అర్థం చేసుకోగలము. పిల్లలు మనల్ని చూసి నవ్వగలుగుతారు. వారి స్వచ్చమైన నవ్వు చూసి మనకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా మర్చిపోతాము. ఈ వయసులో పిల్లలు వీపు మీద పడుకొని గాలిని తంతుంటారు. పాకడం, దొర్లడం వాళ్ళకి మంచి టైం పాస్ అయిపోతుంది. ఈ వయస్సులో పిల్లలని ఒక చాప మీద వదిలి చుట్టూ రంగుల ర౦గుల బొమ్మలు పెట్టండి. వాటికోసం పాకడంలోనే పిల్లలు పెరుగుతారు, అదే వారికి మంచి వ్యాయామం. ఎట్టి పరిస్తితుల్లోను వారి దగ్గరలో ప్రమాదకరమైన వస్తువులు ఉంచకండి, నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది.
3. 8 – 12 నెలలు
ఈ దశలో పిల్లలు దాదాపు నడవగలిగే స్టేజ్ వరకు వెళ్తారు. 8 -12 నెలల పిల్లలకు ఘన పదార్థాలు తినిపి౦చడం మొదలు పెటవచ్చు. ఈ వయసుల్లోనే పిల్లలు మన స్వరమును, మనల్ని గుర్తుపట్టగలరు. మన అడిగే ప్రశ్నలకి సమాధాన౦గా చిన్ని చిన్ని శబ్దాలు చేస్తున్నారు అంటే పిల్లలు ఎదుగుదల కరెక్ట్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. పిల్లలు ఈ వయస్సులోకి వచిన్నప్పుడు తల్లిదండ్రులు వారి మీద చాల శ్రద్దగా ఉండాలి. పాకుతూ ఏవంటే అవి నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి.
మొదటి సంవత్సరంలో మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్న ప్రతి రోజు పండగలాగా హాయిగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మనకు కలిగే త్రుప్తి ఆనందం మరి ఎప్పుడూ కలగదు. ఈ సంవత్సరంలో మనం కనుక డైరీ రాస్తే ప్రతి పేజీ రంగులతో రాయాలేమో.