“manchi-amma”-ani-anipinchukovalane-prayathnamlo-prathi-okkaroo-marchipotunna-oke-okka

మీ పిల్లల ఆరోగ్యం, ఆహారం, సౌందర్యం, లాంటి విషయాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కావలసినవన్నీ సరైన సమయానికి అందిస్తున్నారా? పిల్లలను పెంచడంలో అందరి సలహాలను తీసుకుని సరైన పద్దతులను ఎంచుకుంటున్నారా? ఒక మంచి అమ్మ అని అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నారా? జీవితంలో అన్ని మీరనుకున్న విధంగా జరుగుతున్నాయా? కానీ ఈ ఒక్క విషయం ఎప్పుడు మర్చిపోతుంటారు.

ఆ విషయం మీ గురించే, అసలు ఆ విషయం మీరే. అన్ని సరే కానీ…మీరు బావున్నారా? అవును, అందరిగురించి కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆలోచించండి. కూతురుగా, భార్యగా, అమ్మగా జీవితం మొత్తం బాధ్యతల్లో మునిగిపోయి మన గురించి ఆలోచించడం మానేస్తాం. అసలు మనమంటూ సంతోషంగా ఉండకపోతే మన బాధ్యతలను ఎలా పూర్తి చేస్తాం. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే మీరు ప్రేమిస్తున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. అందుకె కాసేపు మీ గురించి కూడా పట్టించుకోండి. మీకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే కొన్ని సరదా పనులు అప్పుడప్పుడు చేయండి. ఒకసారి వీటిని ప్రయత్నించండి……..

మీకు నచ్చినవి తినండి

పిల్లలకు పాలు…శ్రీవారికి కాఫీ….ఉదయం టిఫిన్లు…భోజనాలు…అన్ని అందరికి అందించడం అయిపోయిందా? ఇంతకి అసలు మీరేమైనా తిన్నారా ? తినండి మీరు కూడా టైంకి తినడం అలవాటు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి మీకేమైనా అయితే మీరు ప్రేమించే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందరికి నచ్చినవి చేసిపెట్టడం మాత్రమే కాకుండా.మీకు నచ్చినవి, మీరు తినాలనుకునేవి చేసుకొని మొహమాటం లేకుండా తినండి.

మీకంటూ కొంత సమయం

పిల్లలకు పనులు చేసే సరికే టైం అంతా అయిపోతుందా? అయితే పనులు పూర్తి చేయడానికి ఒక ప్లాన్ తయారు చేసుకోండి. ఏంచేసైనా మీకంటూ కొంత టైం ఉండేలా చూసుకోండి. ఈ కొంత సమయం మీకు చాలా అవసరం. ఆ టైంలో ఇంత కాలం చేయడానికి కుదరని పనులు, మీరు ఇష్టపడే పనులు చేయండి.

యోగ చేయండి

ప్రెగ్నన్సీ తో వున్నపుడు, డెలివరీ తరువాత, మీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఇవన్నీ మీ మనసు, భావోద్వేగాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. రోజు యోగ చేయడం ఈ సమస్యలకు ఒక ఉత్తమమైన పరిష్కారం. ముందు యోగ క్లాస్ కి వెళ్ళండి, తరువాత మీరంతట మీరే ఇంట్లో ప్రయత్నించండి. యోగ వీలు కాన్నపుడు సూర్య నమస్కారాలు చేయండి. మీరు చేయడం వలన మీ పిల్లలు కూడా ఒక మంచి అలవాటును నేర్చుకుంటారు.

అందంగా ఉండండి

పిల్లల పుట్టిన తరువాత చాలా మందికి అందంగా కనిపించాలన్న ఆలోచన ఉండదు. లేని అందాన్ని తెచుపెట్టుకోలేము కానీ, ఇంతక ముందు అందం కాపాడుకోవడం కోసం చాలా చేసుంటారు కదా..అవి మళ్ళి మొదలుపెట్టండి. అది మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రసవం తరువాత చర్మం కూడా చాలా మరిపోతుంది దాని మీద కూడా దృష్టి పెట్టండి. మీ సౌందర్యాన్ని తిరిగి తెచ్చుకోండి.

గుర్తుపెట్టుకోండి: మీ పిల్లలకు సంతోషాన్ని పంచడానికి…ముందు మీరు సంతోషంగా ఉండాలి 

Leave a Reply

%d bloggers like this: