తల్లి పాలను దానం చేస్తూ అమ్మ అంటేనే త్యాగం అని నిరూపించిన మహిళ..

త్యాగం, దానం, గొప్పదనం అనే పదాలకు అర్థం చూపించాలంటే ఒక్క అమ్మకే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు తన జీవితంలో తన సంతోషాలను వదులుకుని బిడ్డల ఆనందమే తన ఆనందంగా భావిస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ తల్లి అలా కాదు, తన బిడ్డలతో పాటు ఇతరుల పిల్లలు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రోజుకి 6 లీటర్ల పాలను దానం చేస్తోంది. అసలు ఇలా చేయడం వెనుక అసలు కారణం తెలిస్తే ఆ అమ్మత్యాగం ఏంటో తెలుస్తుంది.

ఈ ప్రపంచంలో తల్లి నుండి ప్రతి బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరం. అయితే తన బిడ్డకు పాలను అందించే అదృష్టం ప్రతి తల్లికీ కొన్ని ఆరోగ్య కారణాల వలన ఉండకపోవచ్చు. అది దృష్టిలో ఉంచుకునే తన పాలను ఇతర పిల్లలకు దానం చేస్తోంది. అసలు విషయంలోకి వెళితే అమెరికాకు చెందిన ఈమె పేరు ఆండర్సన్ సెయిర్రా. ఈమెకు ఇద్దరు పిల్లలు. మొదటిసారి ప్రసవం అయిన తర్వాత ఈమెకు పాల ఉత్పత్తి సరిగ్గా ఉండేది కాదు అందుకని పాల దాతలపై ఆధారపడేది. ఇక కొన్నేళ్ల తరవాత మరో బిడ్డకు జన్మను ఇచ్చింది. అప్పుడు తన బిడ్డకు పాలు అందించే స్థితిలో ఆమె ఉంది.. అలాగే అవసరం అయిన దానికంటే ఎక్కువ పాలు ఉత్పత్తి కావడంతో ఇతరుల పిల్లలకు పాలను దానం చేయాలనుకుంది. తను మొదటిసారి బిడ్డకు జన్మను ఇచ్చినప్పుడు పాలు ఇవ్వలేని స్థితిలో ఎలా ఐతే ఇబ్బందిపడ్డానో ఆ ఇబ్బంది ఇతరుల తల్లులకు పిల్లలకు కలగకూడదని గొప్ప నిర్ణయం తీసుకుంది.

తన బిడ్డకు సరిపడా పాలతో పాటు ఎక్కువగా పాలు ఉత్పత్తి అవుతుండడంతో పాలను సేకరించి దానం చేస్తోంది. రోజుకు 5 సార్లు పాలను సేకరించి వాటిని ఫ్రిజ్ లో ఉంచుతుంది. ఎవరికైతే అవసరమో వాటిని వారికి అందించి మిగిలిన వాటిని మిల్క్ బ్యాంకులకు అందిస్తోంది. ఇలా రోజుకు 6 లీటర్లపైగానే ఆమె సేకరిస్తోంది. ఇప్పటివరకూ కొన్ని వందల మంది పిల్లలకు, వేల లీటర్ల పాలను దానం చేసిన ఆండర్సన్ కు మొదట్లో ఈ విధంగా పాలను సేకరిస్తున్నప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయోమని భయపడేదట, అలాగే ఈ విధంగా ప్రతి రోజూ సేకరించడం కొంచెం అసౌకర్యంగానే ఉన్నా పిల్లల ఆరోగ్యం, ఆనందం ముందు ఇది చిన్నదిగా కనిపించిందని అంటోంది. అలాగే తల్లి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా దానం చేయడం వలన బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళమవుతామని చెబుతోంది.  

Leave a Reply

%d bloggers like this: