గుడ్లలో మాంసకృత్తులతోపాటూ ఇతర పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. గుడ్డు సంపూర్ణ పోషకాహారం అని మనకు తెలిసిందే . కానీ గుడ్లు ఆరోగ్యానికే కాదు.. అందానికీ కూడా ఎంతో మేలుచేస్తాయి. అది ఎలానో ఇక్కడ తెలుసుకోండి..
చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోడానికి
ముందుగా గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుని ఆ తడిని తుడిచేసి ఇప్పుడు తెల్లసొన రాయాలి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల చర్మరంధ్రాలూ శుభ్రపడతాయి.
ముఖం మీద ముడతలు పోగొట్టడానికి
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖం పై వచ్చే ముడతలనూ, సన్నటి గీతలను కనపడకుండా చేయాలంటే గుడ్డులోని తెల్లసొనను పూతలా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. వారంలో రెండుసార్లు ఈ పూత వేసుకోవడం వల్ల యౌవనంగా కనిపిస్తారు.
మొటిమలు తగ్గించడానికి
గుడ్డుసొనలో రెండుమూడు చుక్కల టీట్రీ ఆయిల్ వేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి. అంతేకాదు జిడ్డుచర్మం ఉన్నవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. జిడ్డును అదుపులోఉంచుతుంది,
కళ్ల వాపును తగ్గించాలంటే
గుడ్డు సొనను వేలితో కంటికింది భాగంలో నెమ్మదిగా రుద్దాలి. కాసేపాగి కడిగేయాలి. ఆ తర్వాత కొబ్బరినూనె రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కళ్లవాపు క్రమంగా తగ్గుతుంది.